నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం జారీ చేసిన తాజా బులెటిన్ ప్రకారం, ఈ తుఫాను అక్టోబర్ 28 ఉదయానికి ‘తీవ్ర వాయుగుండం’గా (Severe Cyclonic Storm) మారే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మొంతా అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలోని మచిలీపట్నం లేదా కళింగపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90–100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం చాలా ఉధృతంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇది పశ్చిమ వాయవ్య దిశగా గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ. వేగంతో కదిలింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందపి ఐఎండీ తెలిపింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 600 కి.మీ. దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ. దూరంలో, పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమంగా 750 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.
తుఫాను తాకిడితో తీరం వెంట 50-70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీచే వీలుందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంతాలు ఈదురు గాలులు, జల్లులతో వణుకుతున్నాయి. తుపాను క్రమంగా తీరం వైపు కదులుతుండటంతో, ప్రభావం మరింత పెరుగుతుందని IMD పేర్కొంది. అక్టోబర్ 27 నుండి 29 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తద్వారా తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అధిక ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
IMD ప్రకారం, అక్టోబర్ 28 మరియు 29 తేదీలలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు కూడా తీరప్రాంతాలు, నదీ తీరాలు దరిచేరకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో సముద్ర అలలు ఎత్తుగా ఎగసిపడే అవకాశం ఉండటంతో, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు. అన్ని బీచ్‌లు మూసివేయబడ్డాయి, తీరప్రాంత గ్రామాల్లో ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.