Sankranthi Pandelu: Rooster Fight in AP & Bull Fight in Tamil Nadu | File Photo

East Godavari, January 15: మకర సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి (Sankranthi) సందర్భంగా నిర్వహించే కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. కోడిపందేలపై నిషేధం, హైకోర్ట్ ఆదేశాలు ఉన్నాయి, కోడి పందేలు (Kodi Pandelu/ Cockfighting) నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. అయినప్పటికీ 'అనధికార' పర్మిషన్లతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో యధేచ్ఛగా కోడిపందాలు జరిగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కోడిపందాలలో పాల్గొన్నారు. తూర్పు గోదావరిలో ఒక్క భోగి రోజే రూ. 50 కోట్లకు పైగా పందేలు జరిగినట్లు అంచనా.

అనుమానం రాకుండా పందేల కోసం ఏర్పాటు చేసిన వేదికలలో ముందుగా సాంస్కృతిక వేడుకలు, క్రీడలు ఇతర సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత అసలు కార్యక్రమాలు ప్రారంభం కాగానే వేదికల స్వరూపాలు కూడా మారిపోయాయి. కొన్ని చోట్ల ప్రైవేట్ సెక్యూరిటీ, మరికొన్ని చోట్ల గాలరీలు ఏర్పాటు చేసి పాసులు ఉన్నవారినే లోపలికి పంపించారు.

ఈసారి మహిళలు పెద్దఎత్తున కూడా కోడిపందేలపై ఆసక్తి చూపించారు. పశ్చిమ గోదావరి జిల్లా, మండ్లపర్రులో మహిళలు సాంప్రదాయ బద్ధంగా చీరకట్టులో, చేతిలో కోడిపుంజులతో వచ్చి పందేలలో పాల్గొన్నారు.

నిన్న భీమవరం సమీపంలోని ఉండికి వచ్చిన తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈరోజు కూడా పందెంకోళ్లు పౌరుషం చూపిస్తున్నాయి. పుంజుల కాళ్లకు కత్తులు కట్టి, కోడి పుంజుల పొట్లాటను ప్రజలు వేడుకగా చూశారు. ఎక్కడికక్కడ టెంట్లు వేసి జోరుగా పందేలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల ఐపీఎల్ రేంజ్‌లో ఫ్లడ్ లైట్స్ పెట్టి మరి, అర్ధరాత్రి వరకూ కోడిపందేలు నిర్వహిస్తున్నారు. లోపలికి ప్రవేశానికి టికెట్ ధర రూ. 10 వేల నుంచి రూ. 10 లక్షల వరకు అమ్ముడుపోయాయి.

కృష్ణా జిల్లాలో ఈరోజు ఉదయం నుంచే ప్రారంభమైన కోడి పందేలు

ఉభయ గోదావరి జిల్లాల కోడిపందేలు, భద్రాద్రి కొత్తకూడెం జిల్లాల వరకు పాకింది. పినపాక మండలంలో కోడిపందేలు నిర్వహిస్తున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటు సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఒళ్లు ఝలదరించేలా ఎద్దులతో ఫైటింగ్, జల్లికట్టు చరిత్ర ఏమిటి ? ఎందుకు తమిళనాడు వాసులకు అంత క్రేజ్?!

వందల మంది ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తమ పేరును నమోదు చేసుకున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పోలీసులు మరియు ఉన్నతాధికారుల సమక్షంలో అధికారిక అనుమతులతో సాయంత్రం వరకు ఈపోటీలు జరుగుతాయి.