S Kota, Jan 28: విజయ నగరం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లా ఎస్. కోట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి వైసీపీ తీర్థం పుచుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్‌సీపీలోకి వచ్చానని ఆమె తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరానని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందన్నారు.
గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి గౌరవించారన్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేయటంపై హర్షం వ్యక్తం అవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ నేతల్లో సగంమంది వైఎస్సార్‌సీపీలో చేరుతారని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు కూడా సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.