Guntur, FEB 18: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని అరండాల్ పేటలో పెళ్లి ఇంట్లో అపశృతి (Fire Accident) చోటు చేసుకుంది. బాణసంచా (Crackers) పేలి పెళ్లి పందిరి, ఆటో దగ్ధమయ్యాయి. ఆదివారం రాత్రి 11 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. కాగా.. అందరూ మండపానికి బయల్దేరి వెళ్లే క్రమంలో ఇంటి ముందు బాణసంచా (Crackers) కాల్చారు. దీంతో నిప్పు రవ్వలు పక్కనే ఉన్న బాణసంచా ఆటోలో పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆటో, పెళ్లి పందిరి, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వేడుకల సందర్భంగా టపాసులు కాల్చడం కామన్. అయితే, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి. టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. టపాసులు కాల్చే ప్రాంతానికి, బాణాసంచా నిల్వ ఉంచిన చోటుకి దూరం ఉండేలా చూసుకోవాలి. మనం ఏ చోటులో, ఎలాంటి పరిస్థితుల్లో టపాసులు కాలుస్తున్నామో చూసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం అనేది మర్చిపోకూడదు.
నరసరావుపేటలో పెళ్లి వేడుకలో జరిగింది ఇదే. పటాసులు కాల్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో నిప్పురవ్వలు బాణాసంచా నిల్వ ఉంచిన ఆటోపై పడటం, అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ప్రమాదంతో పెళ్లింట అలజడి రేగింది. వివాహానికి వచ్చిన బంధువులు, చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిసిపడటం చూసి ఆందోళన చెందారు. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.