Fire broke out at an electrical sub-station in Visakhapatnam | ANI Photo

Vishakhapatnam, May 27: విశాఖపట్నంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం నగరంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ విభాగంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, నేడు మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలోని గోపాలపట్నం విద్యుత్ సబ్ స్టేషన్‌లో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

తెల్లవారుఝామున 3:30 గంటల సమయంలో సబ్ స్టేషన్ నుంచి మంటలు చెలరేగటాన్ని గుర్తించిన స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాక బృందాలు మూడు ఫైరింజన్లతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది.

ప్రాథమిక నివేదికల ప్రకారం, సబ్‌స్టేషన్ లోని ఒక ట్రాన్స్‌ఫార్మర్ పేలటంతోనే మంటలు చెలరేగినట్లు అంచనాకు వచ్చారు. ప్రమాదం జరగానే పెద్ద శబ్దంతో పాటు దట్టమైన పొగ మరియు మంటలు సబ్‌స్టేషన్‌ పరిసరాలను ముంచెత్తాయి. ఈ మంటలను అదుపుచేయటానికి ఫైర్ ఫైటర్స్ దాదాపు ఒకటిన్నర గంటల పాటు శ్రమించారు.

Here's the update:

ఈ ప్రమాద సమాచారం తెలియగానే పొరుగునే ఉన్న మర్రిపాలెం అగ్నిమాపక కేంద్రం సబ్‌స్టేషన్లో పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు జిల్లా అగ్నిమాపక అసిస్టెంట్ అధికారి గోపి కృష్ణ తెలిపారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి విద్యుత్ సరఫరా పునరిద్ధరిస్తామని స్పష్టం చేశారు.

కాగా, ఈ ప్రమాద సంఘటనకు గల కచ్చితమైన కారణాలు కానీ, ఎంతమేర నష్టం వాటిల్లిందని ఇంతవరకు నిర్ధారించబడలేదు. అధికారుల బృందం దర్యాప్తు చేస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.