Nellore Road Accident (Photo-video Grab)

Duvvuru, Mar 23: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక వైపు నుంచి పాల వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమచారం. దువ్వూరు నుంచి విడవలూరుకు చేపల వేట కోసం వెళ్తున్న కూలీలు దువ్వూరు వద్ద టాటా ఏస్ వాహనం ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుచ్చి, నెల్లూరు ఆసుపత్రులకు తరలించినట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని వెల్లడించారు. ఘటనపై మంత్రి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో కూలీలు మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు.

తెలతెలవారుతుండగానే మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 8 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్‌లో ఓ ఆటో వేగంగా వెళ్తూ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.