
Amaravati, Sep 8: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని (Andhra Pradesh state government) హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై (Ganesh Chaturthi 2021) దాఖలైన లంచ్ మోషన్ పిటిషిన్‌పై హైకోర్టులో (Andhra Pradesh High Court) విచారణ జరిగింది. నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆర్టికల్ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉంటుందని.. నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది. మరోవైపు పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది.
పబ్లిక్ ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన హక్కును నిరాకరించలేమని.. అదే సమయంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కునూ కాదనలేమని వ్యాఖ్యానించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్టకు అనుమతి నిరాకరిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.