Vijayawada, June 11: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) కల్పిస్తామని ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి.. ఇప్పుడు ఈ కీలక హామీ అమలుపై కసరత్తు చేస్తున్నది. దీనికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఫ్రీ బస్ విధానాలపై అధ్యయనం చేసింది. వీటిలో ఏది ఏపీలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదికనూ సిద్ధం చేసింది.
తెలంగాణే సరిపోలుతుంది..
ఆ నివేదిక ప్రకారం.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే ఏపీకి సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అక్కడి మాదిరిగానే రాష్ట్రంలో కూడా పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసులు, అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ ల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.