AP Nominated Posts((PTI)

Vij, July 20: ఓ వైపు వికసిత్ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేస్తూనే మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందనే సంకేతాలను ఇచ్చారు. ఈ నెల 22 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో గత 5 సంవత్సరాల్లో ఏపీలో జరిగిన పరిణామాలను సభ్యులకు, ప్రజలకు వివరించనున్నారు. అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్‌పై తమ ఎజెండా ఏంటో ప్రజలకు చెప్పనున్నారు.

ఇర 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఏపీలో అధికారంలోకి రావడంతో పార్టీ పటిష్టతపై దృష్టి సారించనున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులను ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అలాగే ఎన్నికల్లో పలువురు నేతలకు హామీ ఇచ్చిన విధంగా వివిధ పోస్టులను అప్పగించనున్నారు.

ప్రధానంగా టీటీడీ ఛైర్మన్ పదవి, టీటీడీ బోర్డు సభ్యుల ఎంపికతో పాటు ప్రధాన ఆలయాలకు ఛైర్మన్లు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు ,గ్రంధాలయ సంస్థలకు ఛైర్మన్లు వంటి ఉన్నాయి. ఇక ఇప్పటికే పదవులు ఆశీస్తున్న నేతలు చంద్రబాబుకు తమ బయోడేటాను అందజేశారు. నామినేటెడ్‌ పదవుల్లో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కొన్ని ఇవ్వాల్సి ఉండటంతో తెలుగు తమ్ముళ్లలో భారీ పోటీ నెలకొంది.

ముఖ్యంగా అందరి కళ్లు టీటీడీ ఛైర్మన్ పదవిపైనే ఉన్నాయి. బీజేపీ ,జనసేన నేతలతో పాటు టీడీపీ నేతలు వందల సంఖ్యలో ఈ పదవిని ఆశీస్తున్నారు. అయితే చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవిని తమ పార్టీ నేతకే ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే గతానికి భిన్నంగా ఈ సారి నామినేటెడ్ పోస్టుల్లో సీనియర్లతో పాటు ఎక్కువ సంఖ్యలో యువతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ సైతం తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇదే అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో సీనియర్ నేతల తనయులతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలు తమకు పదవులు దక్కుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. వాయుగుండంగా మారిన అల్పపీడనం, తడిసి ముద్దైన ఏపీ, తెలంగాణ...తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు, జురాలకు సందర్శకుల తాకిడి

మొత్తంగా ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవుల లిస్ట్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఆశీస్తున్న వారిలో దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, బుద్ధా వెంకన్న, గండి బాబ్జీ తదితరులు ఫస్ట్ లిస్ట్‌లో ఉన్నారు. వీరికి ఎన్నికల సమయంలోనే చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏదో పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది.

వైసీపీ నుండి చేరిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌, జంగా కృష్ణమూర్తి, పట్టాభి, దున్ను దొర, మాజీ మంత్రి కాడారి శ్రవణ్‌, వంతల రాజేశ్వరి సైతం నామినేటెడ్ పదవులను ఆశీస్తుండగా వీరిలో ఎంతమందికి అవకాశం వస్తుందోనన్న ఉత్కంఠమాత్రం తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. మొత్తంగా ఈనెలాఖరులోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులు పెద్ద ఎత్తున చంద్రబాబుతో పాటు లోకేష్‌ను కలిసి తమకు పదవులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.