Udayagiri, Feb 23: ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. అంత్యక్రియలకు సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల అశ్రునయనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు పలికారు.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) ఇటీవలే గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అకాల మరణం పలువురు రాజకీయ నాయకులను షాక్ కు గురిచేసింది. సోమవారం (ఫిబ్రవరి 21) ఉదయం జిమ్ కు వెళ్లే ముందు ఆయనకు గుండెపోటుకు గురయ్యి.. సోఫాలో కుప్పకూలిపోయారు. ఆ తర్వాత వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
నెల్లూరులోని గౌతమ్ రెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి చేరుకుంది. అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి మేకపాటి గౌతమ్ రెడ్డి బంధువులు, సన్నిహితులు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో దారి పొడవునా.. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.