SPSR Nellore, Feb 23: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర (Mekapati Goutham Reddy Funeral) కొనసాగుతోంది. నెల్లూరులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాడు,మర్రిపాడు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి చేరుకుంది. అక్కడి నుంచి స్వగ్రామం బ్రాహ్మణపల్లికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (IT minister Mekapati Goutham Reddy) అంతిమయాత్ర చేరుకుంది. మేకపాటి భౌతికకాయాన్ని చూసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. పుష్పాంజలి ఘటించి ఘననివాళులు అర్పించారు.
అనంతరం అక్కడి మేకపాటి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్) సమీపంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారు. అంతిమయాత్రలో ఆయన బంధువులు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్కు సీఎం దంపతులు బయలుదేరారు. గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కి సీఎం చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరి వెళ్లనున్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. అప్పటికే మంత్రి మేకపాటి భౌతిక కాయాన్ని మంత్రి చాంబర్‌లో ఉంచారు. తన తండ్రి భౌతిక కాయం వద్ద కుమారుడు బోరున విలపించాడు.