Govt. of Andhra Pradesh | Photo: FB

Amaravathi, August 27: కర్నూల్‌లో ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్ (ఏపీ హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతిలో HRC కార్యాలయం ఏర్పాటు చేయడానికి 2017 లో తీసుకున్న నిర్ణయాన్ని సవరించింది. ఈ మేరకు కర్నూల్‌ని మానవ హక్కుల కమిషన్‌కి హెడ్ క్వార్టర్‌గా స్పెసిఫై చేస్తూ నోటిఫికేషన్  తాజాగా జారీ చేసింది.

అంతకుముందు హెచ్‌ఆర్‌సి హెడ్ క్వార్టర్ స్థానానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కర్నూలులో హెచ్‌ఆర్‌సి ఏర్పాటు చేయడం భారంగా ఉంటుందని పిటిషన తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన కోర్టు తాజాగా గురువారం మరోసారి విచారణ జరిపి పిటిషనర్ వాదనను తిరస్కరించింది. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది.

రాష్ట్రంలో ఎక్కడైనా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. HRC ని రాష్ట్రంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఏర్పాటు చేయాలని చెప్పలేము. హక్కుల కమిషన్‌ను తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఏపి రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నట్లు హైకోర్టు గుర్తు చేసింది. కర్నూలులో హెచ్‌ఆర్‌సిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇక మీదట కర్నూల్ కేంద్రంగా ఏపీ మానవ హక్కుల కమిషన్ పని చేయనుంది.