Millennium Towers (Photo-Twitter)

Visakhapatnam, July 31: ఇప్పటిదాకా సంక్షేమ పథకాల అమలుతో దూసుకువెళుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తన దృష్టిని ఐటీ వైపు మళ్లించింది. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా పలు ఐటీ కంపెనీలు తమ యూనిట్లను విశాఖపట్నంలో (Vishakha Turns to IT Hub) ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. త్వరలో కార్వనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖను ఐటీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో (Greater Visakhapatnam) ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దీనివల్ల ప్రధానంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రస్తుత సాంకేతిక అవసరాలతోపాటు విద్యార్థులకు అవసరమైన ఐటీ పరిజ్ఞానం, నైపుణ్యాలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా వివిధ అంతర్జాతీయ, దేశీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఐటీ రంగంలో వస్తున్న కొత్త కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఈ యూనివర్సిటీ (IT Emerging Technologies Research University) ద్వారా అందిస్తారు. ఈ వర్సిటీలో రెగ్యులర్, పార్ట్‌టైమ్‌ ఐటీ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడతారు.

సీఎం జగన్ దూకుడు, మూడు రాజధానుల అంశంపై మరింతగా ముందుకు, విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి నిధులు విడుదల, కర్నూలుకు తరలిన విజిలెన్స్‌ కమిషనరేట్‌

కాగా రాష్ట్రంలో ఎక్కువగా ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల టర్నోవర్‌ సుమారు రూ. 2 వేల కోట్ల మేర విశాఖ జిల్లా నుంచే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతోపాటు ఐటీ అభివృద్ధికి కూడా విశాఖనే కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విశాఖలో ఐటీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలోని మధురవాడ వద్ద ఉన్న రుషికొండలో మిలీనియం టవర్‌-బి నిర్మాణానికి ప్రభుత్వం రూ.19.73 కోట్లు విడుదల చేసింది.  రుషికొండ ఐటి సెజ్‌లో ఉన్న ఈ టవర్‌ స్టార్టప్‌ విలేజ్‌ పక్కనే ఉంది. రెండు మిలీనియం టవర్లలో సదుపాయాలు, నిర్మాణానికి సంబంధించి రూ.65.12 కోట్లు అవసరం అవుతాయని ఎపిఐఐసి గతంలో ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన అనంతరం నిధులు విడుదల చేసినట్లు  ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖపట్నానికి టెక్‌ మహీంద్రా, విప్రో, మెరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ వంటి 14 కంపెనీలు వచ్చాయి. తాజాగా ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది, దీని ద్వారా ఐటీ కంపెనీలకు అవసరమైన మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. మన విద్యార్థులకు కూడా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వెంటనే అంది పుచ్చుకునే అవకాశం ఉంది.

సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్నాక.. మళ్లీ ఆయా కంపెనీల అవసరాలకనుగుణంగా బయట ప్రైవేటుగా ఐటీ కోర్సులను నేర్చుకోవాల్సి వస్తోంది. ఇది వారికి ఆర్థికంగా భారంగా మారుతోంది. దీంతో పాటు కాలేజీ నుంచి వచ్చిన వెంటనే అనేక మందికి వెంటనే ఉద్యోగాలు రావడం లేదు.

ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించడం, విద్యార్థులు మంచి ఉద్యోగాలు పొందేలా తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా విశాఖలో ఐటీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక యూనివర్సిటీ ద్వారా దేశ, విదేశాల్లో మన విద్యార్థులకు అపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో పాటుగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కూడా విశాఖలో ఏర్పాటు చేయబోయే రీసెర్చ్‌ యూనివర్సిటీ (University of Skill Development) ద్వారా సహకారం అందించనున్నారు.