Chittoor, December 10: దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా కళ్యాణ మహోత్సవం (Wedding Ceremony) జరుగుతుంది. పల్లకిలో తీసుకొచ్చిన పెళ్లికూతురు రాణిలా ఉంది, అప్పటికే పెళ్లి పీటల మీద కూర్చున్న వరుడు ఓర చూపులు చూస్తూ ఉన్నాడు. ఘనంగా పెళ్లి తంతు జరుగుతుంది. వివాహ వేడుకకు వచ్చిన అతిథులతో పెళ్లి మంటపం కోలాహలంగా ఉంది. ఇక ముహూర్తం దగ్గర పడింది, పెళ్లిలో ముఖ్యమైన ఘట్టానికి ఘడియలు వచ్చేశాయి. వరుడు (Bridegroom) తాళి అందుకొని వధువు మెడలో కట్టే సమయంలో ఆపండీ.. అంటూ పెళ్లిలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇది జరిగింది సినిమాలో కాదు, చిత్తూరు జిల్లాలో.
వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ , చిత్తూరు జిల్లాలో ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే మోహన కృష్ణ (Mohana Krishna) అనే వ్యక్తి పెళ్లిని పోలీసులు అడ్డుకున్నారు. అతడి పెళ్లి వేడుకకు అనుకోని అతిథులుగా వచ్చిన పోలీసులు మోహన కృష్ణ తాళి కట్టే కొద్ది సమయం ముందే పెళ్లిని ఆపివేయించి అతణ్ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వధువు తరఫు వారు పోలీసులను ప్రశ్నించగా, అసలు విషయాన్ని పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే, మోహన్ కృష్ణ అంతకుముందే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారి దగ్గర కట్నం కింద రూ. 12 లక్షల నగదు, 8 తులాల బంగారం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతితో పెళ్లికి ముఖం చాటేసి, వారి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏకంగా వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమమవడంతో విషయం తెలుసుకున్న మొదటి యువతి బంధువులు నేరుగా అతడి పెళ్లి జరిగే చోటుకు పోలీసులను వెంటబెట్టుకొని వచ్చారు.
అటు పెళ్లి భజంత్రీలు మోగుతుండగా వరుడుని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులు మోహన కృష్ణను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. దీంతో పెళ్లి కాస్తా పెటాకులు అయింది. ఇక వధువు తల్లిదండ్రులు మాత్రం పెళ్లి ఆగిపోయినందుకు కాస్త నిరాశ చెందినా, తమ బిడ్డ జీవితం నాశనం కాకుండా తప్పించుకుందని సర్దుకున్నారు. అయితే వారు కూడా మోహన కృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దగ్గర తీసుకున్న కట్నం డబ్బులు, పెళ్లి ఖర్చులను తిరిగి ఇప్పించాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. హైప్రొఫైల్ ఉద్యోగస్తులను కోరుకుంటూ మోసపోతున్న అమ్మాయిలు: చదవండి
ఈ సంఘటన మొన్న ఆదివారం రోజు జరిగింది, కాగా ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారి జాతీయ స్థాయిలో పాపులర్ అవుతుంది.