Guntur Collector orders arrest of Nandendla Primary Healthcare doctor (Photo-video grab)

Guntur, Sep 12: గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా వైరస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌, వైద్యుడు మధ్య వాగ్వాదం (Guntur Collector vs Doctor) చోటుచేసుకుంది. స్థానికంగా కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై జిల్లా కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్ కుమార్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నా అధికారులు సరైన విధంగా విధులు నిర్వర్తించడంలేదని మందలించే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో సమస్యలు చెప్పాలంటూ వైద్యులను కలెక్టర్ కోరారు. వెంటనే నాదెండ్ల పీహెచ్‌సీ డాక్టర్‌ సోమ్లా నాయక్‌ లేచి ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా లేవని (shortage of COVID beds) చెప్పారు. బెడ్లు ఖాళీగా లేవనేది అవాస్తవమంటూ డాక్టర్‌ను వారించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం చేతకాకపోతే వదిలేయమని కలెక్టర్ అనడంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

Here's Video

ఈ వాగ్వాదంలో  సోమ్లా నాయక్ హూ ఆర్ యూ అని కలెక్టర్ ని ప్రశ్నించాడు. వెంటనే ఆగ్రహించిన కలెక్టర్ శ్యామ్యూల్ ‘వాట్‌ నాన్‌సెన్స్‌. ఏం డాక్టర్‌ ఇతను. నన్ను హూ ఆర్‌ యూ అంటావా? లోపల పడేయండయ్యా’ అని (Guntur Collector orders arrest of Doctor) ఆదేశించారు. ఇది క్లుప్తంగా బయటకు వచ్చిన వీడియోలో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5 లక్షల 47 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 4779కి పెరిగిన కరోనా మరణాలు

సమావేశం నుంచి బయటకు వచ్చిన డాక్టర్‌ సోమ్లా నాయక్‌ను కలెక్టర్‌ ఆదేశాలతో పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడ రాత్రి 9 గంటల వరకు అక్కడే ఉంచి డాక్టర్‌ను పంపించి వేశారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు డాక్టర్‌ను వదిలేసినట్లుగా తెలుస్తోంది. తమకు ఎటువంటి ఫిర్యాదు రానందున డాక్టర్‌ను పంపించే వేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. డీఎస్పీ కార్యాలయం వెలుపల డాక్టర్‌ సోమ్లా నాయక్‌ మీడియాతో మాట్లాడారు. 'ఆవేశంలో ఏమైనా మాట్లాడి ఉంటే పై అధికారి కాబట్టి సార్‌ను (కలెక్టర్‌) క్షమించమని కోరాను. సార్‌ కూడా నన్ను పంపించేయమని అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది.