Andhra Pradesh Floods: వరదలతో ఏపీ విలవిల, బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, లీటరు వంట నూనె, కేజీ ఉల్లి పాయలు, కేజీ బంగాళ దుంపలు ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Andhra pradesh Floods (Photo-Twitter/Kadapa Police)

Amaravati, Nov 22: భారీ వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. వరద పోటు తగ్గడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వంతెనలు కుప్పకూలుతున్నాయి.. రోడ్లు కొట్టుకుపోతున్నాయి.. రైలు పట్టాలు తేలుతూ కనిపిస్తున్నాయి. ఊర్లు ఏరులవుతున్నాయి.. పల్లెలు, పట్టణాలు వణుకుతున్నాయి. భారీ వర్షాలకు (Andhra pradesh Floods) నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

తాజా వరదలతో పంట, ఆస్తి నష్టాలు ఊహించని విధంగా డామేజ్ అవుతున్నాయి. ఇక చెన్నై-కోల్‌కతా మార్గంలో నెల్లూరు దాటాక దామరమడుగు వద్ద 16వ నంబరు జాతీయ రహదారి ఓ వైపు పూర్తిగా కొట్టుకుపోయింది. నెల్లూరు జిల్లా పడుగుపాడు సమీపంలో ట్రాక్‌ పైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పలు రైళ్లను నిలిపేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో రాయల చెరువుకు లీకేజీ ఏర్పడి వంద గ్రామాలకు ముంపు ముప్పు (Flood Situation remains grave) పొంచి ఉంది.

కడప జిల్లా రాజంపేట చెయ్యేరు వరద ఘటనలో 26 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మృతి చెందిన 26 మందిలో తొలి రోజు 12 మృతదేహాలు, మరుచటి రోజు 9 మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఒకటి గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఇప్పటి వరకు 21 మృతదేహాలు కనుగొన్నామని వాటిలో 20 మృతదేహాలు వారి బంధువులకు అందించామని పోలీసులు తెలిపారు. ఒక మృతదేహాం పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఆస్పత్రిలో ఉంచామని తెలిపారు.

మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం, కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటన

భారీ వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వరద కారణంగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో మునుపెన్నడూ చూడని విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు వరదల కారణంగా తిరుమల కొండచరియలు విరిగి ఘాట్‌ రోడ్డుపై పడిపోయాయి. అంతేకాకుండా మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. తిరుమల కొండలపైనుంచి వస్తున్న వాన నీటితో కపిలతీర్ధంలో మండపం కూలిపోయింది.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ వరదలు భయపెడుతున్నాయి. రైలు పట్టాల కిందకు నీరు చేరి ఉధృతికి కొట్టుకుపోవడంతో విజయవాడ–నెల్లూరు మార్గంలో 18 రైళ్లను రద్దు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై బ్రిడ్జి కొట్టుకుపోయింది.

గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యపనులు, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు, వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ సరకుల పంపిణీ, జరిగిన నష్టంపై పక్కాగా అంచనాలు వేయాలన్నారు.

విపత్తులో సాయం చేస్తూ మృతి చెందిన వారికి వెంటనే రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వండి, వారికి వెంటనే కొత్త ఇల్లు మంజూరు చేయండి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం జగన్

పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు సాగు చేసేలా గతంలోనే ప్రకటించిన విధంగా విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు తోడుగా నిలవాలని సీఎం నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, తమ ప్రాంతంలోనే ఉండి సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సీఎం సూచించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరకులు ఇవ్వాలని నిర్ణయించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీగా ఆస్తి, పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. జలదిగ్బంధంలో చిక్కుకుని వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధితలకు ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, లీటరు వంట నూనె, కేజీ ఉల్లి పాయలు, కేజీ బంగాళ దుంపలు పౌరసరఫరాల శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఆదేశాలు జారీ చేశారు.

వర్షాలు కాస్త తెరిపిచ్చినా ఎగువ నుంచి వరదనీరు పోటెత్తుండటంతో దిగువన ముంపు ఎక్కువవుతోంది. రాయలసీమ నుంచి వచ్చే వరదతో నెల్లూరు జిల్లాలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో వ్యవసాయ పంటల నష్టం 12 వేల ఎకరాల మేర పెరిగింది. మిగిలిన జిల్లాల్లోనూ క్రమంగా పెరుగుతోంది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మొత్తం 172 మండలాల్లోని 1,316 గ్రామాలపై వరద ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం నాటికి ఇది 181 మండలాల్లోని 1,366 గ్రామాలకు చేరిందని ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లోని వారికి ఒక్కొక్కరికి 1,000, కుటుంబానికి గరిష్ఠంగా 2 వేల చొప్పున అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వరద ప్రభావిత గ్రామాల్లో కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటరు పామాయిల్‌, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళదుంపలు పంపిణీ చేయాలని రెవెన్యూ (విపత్తు నిర్వహణ)శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మొత్తం 2,007 ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,131 ఇళ్లు నీట మునిగాయి. రహదారులు భవనాలశాఖ పరిధిలో 2వేల కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్‌ పరిధిలో 1,736 కి.మీ. రహదారులు కోతకు గురయ్యాయి.

నెల్లూరు జిల్లాలో పెన్నా నది పొటెత్తడంతో పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. నెల్లూరు సమీపంలోని చెన్నై–కోల్‌కతా ఏషియన్‌ హైవే–16 జాతీయ రహదారికి శనివారం అర్ధరాత్రి పలుచోట్ల గండ్లుపడ్డాయి. పెన్నా వరద ఉధృతికి హైవే కొట్టుకుపోయి శనివారం అర్ధరాత్రి నుంచి ఇరువైపులా సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. వరదల ప్రభావంతో నెల్లూరు జిల్లా పడుగుపాడు సమీపంలో రైలు పట్టాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శనివారం రాత్రి రైలు ట్రాక్‌పైకి నీళ్లు చేరడాన్ని సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అరగంట వ్యవధిలోనే ట్రాక్‌పైకి నీరు చేరింది. దీంతో చెన్నై- విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్లను నిలిపివేశారు.

వరద తీవ్రత పెరిగిన కొద్దీ కింద ఉన్న రాళ్లు, కంకర కొట్టుకుపోవడందో ట్రాక్‌ గాల్లో వేలాడుతోంది. పడుగుపాడు వద్ద మూడు ట్రాక్‌లు ఉండగా రెండు ట్రాక్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి.దెబ్బతిన్న ట్రాక్‌ల పునరుద్ధరణకు రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో కార్మికులు అక్కడికి చేరుకున్నారు. జేసీబీల సాయంతో పనులు ప్రారంభించారు. సాయంత్రానికి ఒక్క ట్రాక్‌నైనా అందుబాటులోకి తీసుకొచ్చి రైళ్ల రాకపోకలకు వీలు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ రైల్వే డీఆర్‌ఎం, ఏడీఆర్‌ఎం, సాంకేతిక సిబ్బంది కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు.

నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మొత్తం 2,007 ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,131 ఇళ్లు నీట మునిగాయి. రహదారులు భవనాలశాఖ పరిధిలో 2వేల కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్‌ పరిధిలో 1,736 కి.మీ. రహదారులు కోతకు గురయ్యాయి. ఆయా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణకు ఎస్‌పీడీసీఎల్‌ సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ చెప్పారు. వీలైనంత త్వరగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది, సామగ్రిని తక్షణమే సమకూర్చుకోవాలని సూచించారు.

దక్షిణ అండమాన్‌, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. ఇవాళ, రేపూ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. అలాగే నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 26 నుంచి డిసెంబరు 2 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.