AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కి  మళ్లీ వర్షాల ముప్పు, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, హెచ్చరించిన విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం, కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం
Heavy Rain Alert ( Photo Pixabay )

Visakhapatnam, October 11:  ఆంధ్ర ప్రదేశ్ ని వర్షాలు ఇప్పట్లో వీడేలా లేవు. మొన్నటి వరకు భారీ వర్షాలతో అతలాకుతలమైన ఏపీకి మళ్లీ ఇప్పుడు వర్షపు గండం ముంచుకొస్తోంది. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, కొమెరిన్‌ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు భారీగా వీస్తాయని తెలిపింది. అలాగే, కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, నిన్న కూడా కోస్తాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

తెలంగాణాలో..

ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండురోజులపాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. గత రెండు రోజులుగా తెలంగాణాను వర్షాలు వణికిస్తున్నాయి. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఖమ్మం జిల్లా ఏన్కూరులో 9.3, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 7.5, వెంకటాపురం మండలం అలుబాక 7.3, మహబూబ్‌నగర్‌లోని హన్వాడలో 7, జగిత్యాల జిల్లా ఇనుగుర్తిలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

రాయలసీమలో..

నిన్న రాయలసీమలోని కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన మార్గాలు లేక, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. మంత్రాలయం, వెల్దుర్తి, గోనెగండ్ల, కౌతాళం, హోళగుంద, హాలహర్వి, ఆస్పరి మండలాల్లో కుంభవృష్టి కురిసింది. వర్షపు నీటితో ఆదోని పట్టణం జల దిగ్బంధమైంది. రహదారులపై రెండు నుంచి మూడు అడుగుల ఎత్తున నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నేడు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.