AARAA Mastan

2024 సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆరా (AARAA) సంస్థ అధినేత షేక్ మస్తాన్ ఏపీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఆరా సంస్థ తరఫున ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మస్తాన్... ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించారు.

గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని అంచనా వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని, అదే విధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వనున్నారని 'ఆరా' మస్తాన్ వివరించారు.  ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు

ఇక, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతాడని అంచనా వేశారు. బాలయ్యకు మంచి మెజారిటీ వస్తుందని అన్నారు. అయితే... ఓవరాల్ అంచనాల ప్రకారం ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాలు గెలుచుకోవచ్చని, టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు లభిస్తాయని మస్తాన్ వివరించారు. అదే సమయంలో లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి 13 నుంచి 15 స్థానాలు, టీడీపీ కూటమికి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా వేశారు.