Kanna Lakshmi Narayana Joins TDP (Photo-Video Grab)

Amaravati, May 9: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. రైతులు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి కుర్చీ ఉంటే చాలు... తనకు రావాల్సిన ఆదాయం వస్తుంది అన్న ధీమాలో సీఎం జగన్ ఉన్నారని కన్నా మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడం జగన్ కు చేతగాకపోతే, తక్షణమే సీఎం కుర్చీనుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన పదవి నుంచి తప్పుకుంటే, అన్నదాతలకు ఎలా న్యాయం చేయాలో టీడీపీ చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు.

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అకాల వర్షాలు, రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన రైతులు విలపిస్తుంటే, ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం మొలకెత్తి, మిర్చి నీళ్ల పాలై, ఇతర పంటలు పొలాల్లోనే కుళ్లి మగ్గిపోతుంటే, మంత్రులు ప్రతిపక్ష నేతల్ని తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం రైతుల ముఖం కూడా చూడకుండా నిద్రపోతోందని కన్నా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగనన్నకు చెబుదాం లాంచ్ చేసిన సీఎం జగన్, మీ సమస్యను 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఎలా చెప్పాలో తెలుసుకోండి

“టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి జిల్లాల్లో వరి రైతుల వద్దకు వెళ్లి, వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆయన పర్యటనలో రైతుల్ని ఆదుకోలేని ప్రభుత్వ డొల్లతనం, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం మరోసారి బట్టబయలయ్యాయి. చంద్రబాబు రైతుల వద్దకు వెళ్లకుండా ఉంటే, అసలు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కనీసం నోటిమాటగా కూడా రైతుల ప్రస్తావన చేసేవారు కాదు.

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో రైతుల్ని అధికారులతో కుమ్మక్కై ఎలా దోచుకుంటున్నారో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. 75 కిలోల ధాన్యం బస్తాకు ఒకచోట 5 కేజీలు, మరోచోట 12 కేజీలు అదనంగా ధాన్యం ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల మిల్లర్లను అడ్డంపెట్టుకొని ప్రభుత్వమే బస్తాకు రూ.100 నుంచి రూ.200 లు అనధికారికంగా వసూలుచేస్తోంది.

 ఏపీ ఈఏపీసెట్ హాల్‌ టిక్కెట్లు విడుదల, హాల్ టిక్కెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం..

లారీధాన్యానికి కొన్నిచోట్ల మిల్లర్లు రూ.10 వేలనుంచి రూ.20 వేల వరకు రైతులనుంచి దండుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విధంగా రైతులకష్టాన్ని అప్పనంగా దోచుకుంటున్నా కూడా ప్రభుత్వంలో చలనంలేదు" అని విమర్శించారు. రైతుల కష్టానికి, నష్టానికి జగన్ ఏవిధంగా న్యాయం చేస్తాడో సమాధానం చెప్పాలని కన్నా నిలదీశారు. రూ.3 వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్ల ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏమైందో ముఖ్యమంత్రి రైతులకు చెప్పాలి అని స్పష్టం చేశారు.