వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. కాగా, ఇది 24వ తేదీ లోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తోంది. ఈ ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీనివల్ల వచ్చే నెల 3వ తేదీ వరకు వర్షాలకు ఆస్కారముంది.
తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు, స్కూల్స్ మూతపడే అవకాశం, పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో గోదావరి ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతోంది. ఆ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద నది వరద బుధవారం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువనున్న లక్ష్మి బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీని ప్రభావం ధవళేశ్వరం వద్ద కనిపించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం మంగళవారం 9.55 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 51,268 క్యూసె క్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.