Andhra Pradesh:చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నా, రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీలో సీఎం జగన్
CM Jagan (Photo-Twitter/AP CMO)

Amaravati, Nov 23: రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్‌ పోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) అన్నారు. చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం జగన్‌ కోరారు. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ (Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha )ని సీఎం జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు.

ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్‌, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతందిని సీఎం జగన్‌ తెలిపారు.

బలహీనపడిన వాయుగుండం, ఏపీకి తప్పిన భారీ వర్షాల ముప్పు, నెల్లూరు జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం

అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్‌

వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుంది. సివిల్‌ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్‌ ఇస్తాం. ప్రతి కమతానికి ఒక ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఇస్తాం. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నాం.

క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లోనే

దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ సర్వే చేస్తున్నాం. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించాం. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టాం. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతుల చేతుల్లో పెడతాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. మన గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎవరూ మోసం చేయడానికి వీళ్లేకుండా వ్యవస్థను మార్చుతున్నాం. లంచాలకు ఎక్కడా తావులేదు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

పాలనలో విప్లవాత్మక మార్పులు

సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. కుప్పం సహా 25 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. మూడు ప్రాంతాలు బాగుపడేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వ రంగంలో 11 మెడికల్‌ కాలేజీలుంటే ప్రస్తుతం మరో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం. రైతన్నల కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.

ఆ దుష్టచతుష్టయాన్ని ఏమనాలి?

తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, జగన్‌ అంటారు. కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటాం. ఎన్నికలపుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసేది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దుష్టచతుష్టయాన్ని ఏమనాలి?. మోసం చేసే చంద్రబాబులాంటి వారికి మళ్లీ అధికారం ఇవ్వొద్దు.

పరాయి వాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడు అంటారు. పరాయి స్త్రీమీద కన్ను వేసి ఎత్తుకుపోతే రావణుడు అంటారు. రావణుడిని సమర్థించినవాళ్లను రాక్షసులు అంటున్నాం. దుర్యోధనుడిని సమర్థించిన వారిని దుష్టచతుష్టయం అంటాం. మామకు వెన్నుపోటుపొడిచి సీఎం కుర్చీని లాక్కుని, ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని సమర్థిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, పవన్‌ను మరి ఏమనాలి? అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.

నిర్విరామంగా మహాయజ్ఞం

రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్‌ పరిపాలన, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్‌ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు.

మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్‌ మేజిస్ట్రేట్‌లను నియమించారు. 2,797 మంది వీఆర్‌ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్‌ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం జగన్‌ రైతులకు అందించనున్నారు.