దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. ఇక తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ తో పాటు టీడీపీ, వైసీపీ కూడా గుర్తింపు పొందిన పార్టీలుగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను రిజర్వ్ చేయనున్నట్లు ఈసీ తెలిపింది.
అయితే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ మాత్రం గతంలో పొందిన గాజు గ్లాస్ సింబల్ ను కోల్పోయింది. ఆ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. జనసేన పలు ఎన్నికలకు దూరంగా ఉండడం వల్లే తన గుర్తును కోల్పోయింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలంటే నిబంధనల ప్రకారం ఓట్ల శాతాన్ని తెచ్చుకోవాలి. అయితే జనసేన పార్టీ పలు ఉప ఎన్నికలకు దూరంగా ఉండటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా తక్కువచోట్ల పోటీ చేసింది. ఈ కారణంగానే జనసేన తన గుర్తును కోల్పోయింది.
ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట జరిగిన బద్వేలు ఉప ఎన్నిక సమయంలోనే జనసేన ఆ గుర్తును కోల్పోయింది. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చింది. దీంతో నవతరం పార్టీ అభ్యర్థికి ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించగా.. ఆ పార్టీ శ్రేణులు సింబల్ ను జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాయి. తాజాగా ఈసీ ఆ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో జనసేనకు షాక్ తగినట్లయింది.
వచ్చే ఎన్నికల్లో ఈసీ జనసేనకు మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు కామన్ గా ఇస్తే పర్వాలేదు, లేకపోతే భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. గాజు గ్లాస్ సింబల్ జనసేనదిగా భావించి ఓట్లు వేసే అవకాశం ఉంది.