ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనచేత ప్రమాణం చేయించారు. సీఎం జగన్ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్‌సింగ్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు,హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు బూడి ముత్యాలనాయుడు,తానేటి వనిత, అంబటి రాంబాబు, మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఉన్నతాదికారులు పాల్గొన్నారు. అనంతరం హై టీ కార్యక్రమంలో అంతా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్‌సింగ్‌ది న్యాయమూర్తుల కుటుంబం. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్‌సింగ్. ఇటీవల కాలం వరకు బాంబే హైకోర్టులో నంబర్ టూ స్థానంలో కొనసాగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేస్తారు.