New Delhi, Mar 2: మారిటైమ్ ఇండియా-2021 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను (Maritime India Vision-2030 E-Book) ప్రధాని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy), గుజరాత్ సీఎం విజయ్ రూపాని, ఫిక్కీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్ తదితర దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి.
నేటి నుంచి 4వ తేదీ వరకు మారిటైమ్ ఇండియా సదస్సు (Maritime India Summit 2021) జరగనుంది. కాగా, సదస్సులో పాల్గొనేందుకు మంచి స్పందన కనిపిస్తోందని ఇప్పటి వరకు రూ.1.70 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) రూపొందించే పనిలో ఉందని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందాలపై మారిటైమ్ ఇండియా రెండో విడత సదస్సులో సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తీర రాష్ట్రాలు, భాగస్వాములు ఈ ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
Here's AP CMO Tweet
Hon'ble CM @ysjagan attended the inaugural of Maritime India Summit 2021 virtually from the camp office today. The CM invited companies from India & abroad attending the summit, to invest in AP & assured them the best environment to carry out their operations. pic.twitter.com/5R7q5oj6SB
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 2, 2021
ఈ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మారిటైమ్ రంగంలో భారత్ విజయాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ విజయయాత్రలో భాగస్వాములు అవ్వాలని ప్రపంచదేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సముద్ర రంగంలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని పేర్కొన్నారు.
దేశంలో నౌకాశ్రయాల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని, 2030 నాటికి 23 జలమార్గాలను అందుబాటులోకి తెస్తామని ఉద్ఘాటించారు. జల రవాణా మార్గాలు చౌక మాత్రమే కాదని, పర్యావరణ హితం కూడా అని అభిప్రాయపడ్డారు. సముద్ర మార్గంలో ఆదాయాన్ని పెంపొందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నామని వివరించారు.
పోర్టులపై 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఓడరేవుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు. సముద్రరంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. అటు సముద్ర పర్యాటకానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని, 78 లైట్ హౌస్ ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఈ సదస్సులో ఏపీ సీఎం.. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2020లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని.. ఎగుమతుల్లో ఏపీ వాటా 4 శాతమని.. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 10 శాతానికి పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరుగుతోందని.. 2023 నాటికి వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
2030 సంవత్సరం నాటికి దేశ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా పది శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేయడానికి కావలసిన అన్ని వనరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.