COVID-19 Vaccination (Photo Credits: PTI)

Amaravati, June 20: ఏపీలో మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్‌ నడుస్తోంది. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ (Mega Vaccine Drive in AP) జరుగుతోంది. మ.12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి వ్యాక్సిన్ (Vaccination) వేశారు. ప.గో జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా 59వేల మందికి.. విశాఖ జిల్లాలో 50వేలు.. తూ.గో జిల్లాలో 42వేల మందికి వ్యాక్సిన్‌ వేశారు.కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్‌ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది.

ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించి... అందుకు తగ్గట్టుగా ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. మరోవంక గ్రామాల్లో ఫీవర్‌ సర్వేను నిరంతరం కొనసాగిస్తూ... లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షించి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స చేసే (టీటీటీ) వ్యవస్థను కూడా పకడ్బందీగా కొనసాగిస్తోంది. కోవిడ్‌ కట్టడికి ఈ టీటీటీ ప్లస్‌ వ్యాక్సినేషనే శరణ్యమంటూ శనివారం కూడా రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసిన నేపథ్యంలో... కొన్నాళ్లుగా సీఎం జగన్‌ సారథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

జగన్ సర్కారు మరో కీలక వ్యూహం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త ఎత్తుగడ, వర్చువల్‌గా రోడ్‌షోలు, డిప్లొమాటిక్‌ సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ఏపీ ఈడీబీ

ఈ మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లూ ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని జిల్లాలకు కలిపి 14 లక్షల డోసుల టీకా చేరింది.ఈ డ్రైవ్‌లో ప్రధానంగా ఐదేళ్ల లోపు చిన్నారులున్న తల్లులందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాల్లో కూడా వ్యాక్సిన్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకునేలా కలెక్టర్లను ఆదేశించారు. సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్న వారితో పాటు ఆధార్‌ కార్డు తీసుకెళ్లిన వారికి సైతం వ్యాక్సిన్‌ వేస్తారు. తల్లుల తర్వాత 45 ఏళ్లు దాటిన వారికి ప్రాధాన్యమిస్తారు. అర్హులందరికీ ఇప్పటికే సచివాలయాల వారీగా సమాచారమిచ్చారు. సమాచారం అందకపోయినా.. ఆధార్‌ కార్డు తీసుకెళ్లిన అర్హులక్కూడా టీకా వేస్తారు. వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో 19 వేల మంది ఏఎన్‌ఎంలు, 40 వేల మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.