Rains (Photo-Twitter)

Hyderabad, March 20: ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు (Thunder Storms) పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడేసమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

Telangana Weather Report: తెలంగాణకు ఎల్లో అలర్ట్, వచ్చే నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ 

శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి టెక్కలి, పాతపట్నంలో ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఇదిలాఉంటే.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాలపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడిగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇదిలాఉంటే పంటచేతికొస్తున్న సమయంలో అకాల వర్షాలు పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.