Rains (Photo-Twitter)

మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు ఐఎండీ చల్లని కబురును అందించింది. రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.

కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వికారాబాద్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మండే ఎండల్లో ఏపీ వాసులకు ఐఎండీ చల్లని కబురు, వచ్చే నాలుగు రోజులు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం

మహారాష్ట్ర నుంచి కర్ణాటక వీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు పడిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద చేరే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికల్లో పేర్కొంది.

రాష్ట్రంలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 9 జిల్లాల్లో వందకుపైగా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలాల్లో 5 సెం.మీ., కరీంనగర్‌లో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడ్డాయి. వర్షాలతో రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి.