Anantapur, June 14: అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్యకు (mother and daughter sucide) పాల్పడ్డారు. ఏడాది కిందట తండ్రి రామకృష్ణారెడ్డి కరోనా బారినపడి మృతి చెందగా, సోమవారం సచివాలయ కార్యదర్శి అపర్ణ, తల్లి వెంకటరమణమ్మ ఆత్మహత్య (sucide in ananthapur district) చేసుకున్నారు. కుటుంబ పెద్ద లేడన్న బాధతోనే తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాడిపత్రి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పుట్లూరు మండలం చింతరపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి భార్య వెంకటరమణమ్మ(52), కుమార్తె అపర్ణ(25)తో కలిసి తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం రోడ్డులో నివాసం ఉండేవారు. గతేడాది కరోనా బారిన పడి రామకృష్ణారెడ్డి మృతి చెందారు. అతడి భార్య, కుమార్తె ఆ ఇంట్లోనే ఉంటున్నారు. కుమార్తె అపర్ణ పుట్లూరు మండలం గూడూరు సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహించేవారు.
తండ్రి మరణించినప్పటి నుంచి అపర్ణతో పాటు ఆమె తల్లి తరచూ ఇంటి పెద్ద లేడని బాధపడుతుండేవారు. ఆదివారం రాత్రి తీవ్ర మనస్తాపానికి గురైన వారు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.