Amaravathi, Mar 01: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) భేటీ ముగిసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో (CM’s Camp Office) దాదాపు గంటన్నర పాటు సీఎం జగన్‌తో అంబానీ బృందం చర్చలు జరిపింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరు చర్చించారు.
ఈ సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌నత్వానీ పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ముకేశ్ అంబానీ బృందానికి స్వాగతం పలికారు.
రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలతో పాటూ.. రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసే ప్రాజెక్టులపై ప్రముఖంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంబానీ తొలిసారి కలిశారు. ఇటీవల విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం నాడు–నేడు కింద చేపట్టిన కార్యక్రమాల్లో రిలయన్స్ భాగస్వామ్యంపైనా చర్చించారు.
Here's CMO Andhra Pradesh Tweet
Sri Mukesh Ambani, Chairman and Managing Director of Reliance Industries called on Hon'ble Chief Minister @ysjagan at the Camp Office in Tadepalli, today. pic.twitter.com/LC3zKKO7DK
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 29, 2020
అయితే పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీటు కోసం చర్చించారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. నత్వానీ 2008 నుంచి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మరోసారి ఆయన్ను పెద్దల సభకు పంపడం కోసం అంబానీ జగన్‌ను కలిశారని అనధికార సమాచారం.
వైఎస్సార్సీపీ తరఫున నలుగురు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్న తరుణంలో నత్వానీకి అవకాశం ఇవ్వాలని అంబానీ కోరారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే వైఎస్సార్సీపీ నుంచి ఒక రాజ్యసభ సీటును బీజేపీ కోరిందనే వార్తలు ఇటీవల వెలువడిన సంగతి తెలిసిందే.
పరిమళ్ ధీరజ్‌లాల్ నత్వానీ 1990ల్లో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. 1997లో ఆయన రిలయన్స్ గ్రూప్‌లో చేరారు. 2016 నాటికి ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్ గ్రూప్ ప్రెసిడెంట‌్‌గా ఎదిగారు. ముకేశ్‌తోనే కాదు ఆయన తండ్రి ధీరూభాయి అంబానీతోనూ నత్వానీ కలిసి పని చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కోర్ లీడర్‌షిప్‌లో ఆయన కీలక సభ్యుడు. జామ్‌నగర్ రిఫైరీ కోసం పది వేల ఎకరాల భూమిని సేకరించడంలో ముఖ్యపాత్ర పోషించారు. రిలయన్స్ 4జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులోనూ నత్వానీ కీలక భూమిక పోషించారు.