విజయవాడ, ఏప్రిల్ 23: టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో అగౌరవంగా ప్రవర్తించారనే ఆరోపణలపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాకు వివరించారు. చంద్రబాబు హయంలో మహిళ కమిషన్‌ను తూ తూ మంత్రంగా, ఆటబొమ్మలా తయారు చేశారని విమర్శించారు. మహిళ కమిషన్ సుప్రీమే అని వాసిరెడ్డి పద్మ బోండా ఉమా విమర్శలకు సమాధానం చెప్పారు. మీ హయాంలో మహిళ కమిషన్ కన్నీళ్లు పెట్టుకోవడానికి ఉంది.. ఇప్పుడు కన్నీళ్ళు తుడవడానికి ఉంది. బాధిత మహిళల పట్ల ఎలా వ్యవహరించాలి చంద్రబాబుకు తెలియదా..? నా పట్ల అమర్యాదగా వ్యవహరించాక సన్మానం చేయాలా అని వాసిరెడ్డి పద్మ సమాధానం ఇచ్చారు.
మహిళా కమిషన్ కన్నీరు పెట్టుకోవడానికి లేదని.. కన్నీరు తుడవడానికి ఉందన్నారు. బోండాలాంటి వారికి కన్నీరు పెట్టించడానికి ఉందని చెప్పారు. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని.. బాధితురాలికి ధైర్యం ఇవ్వకపోతే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా తానేం చేయాలి..? అని అడిగారు. బాబు అండ్ బ్యాచ్ చేసిన పనికి సమన్లు ఇవ్వకపోతే.. చప్పట్లు కొడతారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు , బోండా ఉమా నోటీసులు తీసుకుని మహిళా కమిషన్‌కు సమాధానం చెప్పాలన్నారు.
మహిళ కమిషన్‌ను మీరు డమ్మీ అనుకుంటున్నారా..? మహిళ కమిషన్ రెక్కలు లేకుండా చేద్దాం అనుకుంటున్నారా ? అని పద్మ ప్రశ్నించారు. మహిళ కమిషన్ సమన్లు ఇచ్చిందంటే వీళ్ళు చచ్చినట్టు రావాల్సిందే. చంద్రబాబును చూసో, ఆఫ్ట్రాల్ ఒక బోండా ఉమను చూసో మేము ఈ నోటీస్ ఇవ్వలేదని ఆమె వివరించారు. బాధితురాలి దగ్గర వ్యవహరించిన తీరుపై నోటీసులు ఇచ్చాము. మహిళ కమిషన్ తరపున బాధిత కుటుంబాన్ని సీఎంను కలిసేలా చేస్తామని ఆమె అన్నారు.
విజయవాడ వాంబే కాలనీకి చెందిన యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడగా, ప్రస్తుతం ఆ యువతి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలిని పరామర్శించేందుకు శుక్రవారం మ.12 గంటల సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు. ఆమెను ఆస్పత్రిలోకి వెళ్లనీయకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా నేతృత్వంలో మహిళా నాయకురాలు పంచు మర్తి అనురాధ తదితరులు అడ్డుకున్నారు.