Amaravati, May 25: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును కొట్టారనే ఆరోపణలపై సీబీఐ (CBI) దర్యాప్తునకు పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఎంపీ రఘురామకృష్ణరాజును (Narasapuram MP raghurama krishnamraju) కస్టడీలో ఏపీ సీఐడీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారంటూ ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (supreme court ) విచారణ జరిగింది. దీనిపై జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అయితే తన పిటిషన్‌ను రఘురామ తరఫు న్యాయవాది రోహత్గీ సవరించుకున్నారు. ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐ మాత్రమే కావాలనే విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం మినహా ఏపీ ప్రభుత్వం, ఏపీ డీజీపీ వంటి ప్రతివాదులను జాబితా నుంచి తొలగించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కస్టడీలో ఉన్న ఎంపీని చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నట్లు తెలిపారు. ఆయన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై న్యాయవాది దవే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా లేకుండా చేయడంపై ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం తెలిపారు.
అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ప్రతివాదుల జాబితాలో మార్పులు చేసేందుకు అనుమతించింది. ఏపీ సర్కారు వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆ కేసును ఆరు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేరుగా ఆసుపత్రి నుంచి విడుదల చేయించాలని ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. రఘురామ ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. ఆయనకు డాక్టర్ సేన్ గుప్తా, డాక్టర్ ఫిలిప్ పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తీవ్రమైన కాళ్ల నొప్పితో బాధపడుతున్నానని రఘురామ కృష్ణరాజు చెబుతున్నారు. అలాగే, ఒంట్లో మగతగా ఉంటోందని ఆయన వైద్యులకు చెప్పారు. తనకు రెండు, మూడు రోజులు మిలటరీ ఆసుపత్రిలోనే వైద్యం అందించాలని నిన్న ఆ ఆసుపత్రి కమాండెంట్‌కు ఆయన లేఖ రాశారు. అంతేగాకుండా, తన వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని తెలిపారు.
నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు విడుదల మరో నాలుగు రోజులు వాయిదా పడింది. కోర్టు ఆదేశాలతో సోమవారం రఘురామ న్యాయవాదులు ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశారు. కాగా సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఆయన ఆరోగ్య పరిస్ధితిని గుంటూరు జిల్లా మెజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ సమ్మరీ కావాలని న్యాయమూర్తి అడిగారు. అయితే రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావటానికి మరో నాలుగు రోజులు సమయం పడుతుందని ఆర్మీ వైద్యులు మెజిస్ట్రేట్ కు తెలపటంతో రఘురామ విడుదల వాయిదా పడింది.
నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటీషన్ వేస్తామని రఘురామతరుఫు న్యాయవాదిలక్ష్మీనారాయణ తెలిపారు. రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన రఘురామకు సుప్రీంకోర్టు మే 21న బెయిల్ మంజూరు చేసింది. గుంటూరులోని ట్రయల్ కోర్టులో కేసు నడుస్తుండటంతో పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటం వల్ల ఎంపీ విడుదలకు ఈప్రక్రియ జరగాల్సి ఉంది.