Amaravati, May 15: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు (MP Raghurama Krishnam Raju Arrest) చేసింది. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్ 12/2021 నమోదు చేశారు. పక్కా పథకం ప్రకారమే రఘురామకృష్ణంరాజు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పేర్కొంది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది.
ఎఫ్‌ఐఆర్ 12/2021లో రఘురామ, TV5, ABN కుట్రను సవివరంగా సీఐడీ పేర్కొంది. రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచినందుకు CRPC 124 (A) సెక్షన్, కుట్రపూరితమైన నేరానికి పాల్పడినందుకు మంగళగిరి సీఐడీ పీఎస్‌లో124ఏ, 120 (B) IPC సెక్షన్, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153 (A), బెదిరింపులకు పాల్పడినందుకు CRPC 505 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఎంపీ రఘురామకృష్ణరాజుకు (MP Raghurama Krishnam Raju Case) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు (High Court) తిరస్కరించింది. రఘురామ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. బెయిల్ కోసం సీఐడీ కోర్టులో ప్రయత్నించమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్రదించాలని హైకోర్టు సూచించింది. అనంతరం రఘురామ బెయిల్ దరఖాస్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కింద కోర్టును హైకోర్టు ఆదేశించింది. తీర్పుకాపీని కూడా వెంటనే ఇస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు.. వెంటనే రిమాండ్‌కు పంపుతామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. రఘురామకృష్ణరాజు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సీఐడీ పోలీసులు.. ఎంపీ భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చారు. వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలుచేశారని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగం మోపారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, న్యూస్ చానళ్లు, వ్యక్తులతో కలిసి విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని కేసు నమోదుచేశారు.