Nellore, Feb 3: నెల్లూరు రూరల్ నియోజక వర్గ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ నియమించిన నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం తాను శ్రమించానని, అయితే అనుమానించిన చోట ఉండొద్దనే ఇప్పుడు దూరం జరుగుతున్నానని పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Nellore Rural YSRCP MLA Kotamreddy Sridhar Reddy) పేర్కొన్నారు. తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ ఆయన చేసిన ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆయన ఆరోపణలపై వైసీపీ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు (CM YS Jagan) నమ్మక ద్రోహం చేశారని ఎమ్మెల్యే అనిల్ గురువారం మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) శుక్రవారం మరోమారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.‘ఓ ఎమ్మెల్యే ఫోన్ ను ట్యాప్ చేయడమంటే ఆషామాషీ కాదు. దీని వెనక ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల హస్తం ఉంది.
ఆధారాలు దొరికే వరకు నేను కూడా పూర్తిగా నమ్మలేదు. నా ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి కేంద్ర హోంశాఖకు ఓ లేఖ రాసి, విచారణ జరిపించాలని కోరితే బాగుండేది. వాళ్లు విచారించి నిజానిజాలు వెల్లడించేవారు. దాంతో తప్పెవరిదనేది తేలిపోయేది, వారిపై చర్యలు తీసుకుంటే అయిపోయేది’ అని అన్నారు.
ముప్పై, ముప్పై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, అధికార పార్టీకి దూరం అవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసని కోటంరెడ్డి చెప్పారు. ప్రాణాతిప్రాణంగా ఆరాధించిన జగన్ ప్రభుత్వంలో నుంచి బయటకు రావడానికి కారణం అందరికీ స్పష్టంగా చూపించానని చెప్పారు. తనను అనుమానించడం వల్లే పార్టీకి దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు కోటంరెడ్డి చెప్పారు.
మౌనంగానే తప్పుకుందామని అనుకున్నానని, పదిమంది మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సలహాదారులు, నేతలు నాపై ఆరోపణలు చేయడంతో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని కోటంరెడ్డి వివరించారు. పార్టీలోనే ఉండి, నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని చెప్పారు. తానలా చేయలేదని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
కోటంరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారు. నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండి. శాశ్వతంగా జైల్లో పెట్టండి. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. నా గొంతు ఆగే ప్రశ్నే లేదు. నా గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం.. ఎన్‌కౌంటర్ చేయించండి. అప్పుడే నా గొంతు ఆగుతుంది. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుంది’’ ’’ అని కోటంరెడ్డి అన్నారు.