Visakhapatnam, July 27: విశాఖపట్నం జిల్లాలోని జమ్మాదేవిపేటలో విషాద ఘటన (Pedderu River Tragedy) చోటుచేసుకుంది. వడ్డాది మాడుగుల పెద్దేరు నదిలో మునిగిపోయిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. పెద్దేరు నది దాటుతుండగా ఊభిలో చిక్కుకుపోయిన నలుగురు చిన్నారులు (4 Children died after fell into Pedderu Revu) మరణించారు. మృతి చెందిన చిన్నారులు మహేందర్(7), షర్మిల(7), ఝాన్సీ(10), జాహ్నవిలను గౌరవరం గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తమ కళ్లముందే తమ కంటిపాపలు నీటిలో మునిగిపోవడం చూసిన కన్నతల్లుల ఆవేదన అక్కడున్న వారిని కలిచివేసింది.
గవరవరం గిరిజన గ్రామంలో ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావడంతో వంతాల వెంకట ఝాన్సీ, వంతాల గౌతమి షర్మిల, వంతాల భవ్య జాహ్నవి, నీలాపు మహేంద్ర మధ్యాహ్నం అందరితో భోజనాలు చేసి ఆటలాడుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఈ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ఉతకడానికి పెద్దేరుకు వెళ్తుంటారు. తమ తల్లులు సైతం మధ్యాహ్నం 3 గంటల తరవాత పెద్దేరు రేవుకు బయలుదేరడంతో వారితోపాటే ఝాన్సీ, జాహ్నవి, మహేంద్ర, గౌతమి సరదాగా రేవు వద్దకు వెళ్లారు.
ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దేరు నది దాటుతుండగా వీరు బట్టలు ఉతికే చోటుకు సమీపంలో పెద్ద ఊబి ఏర్పడింది. ఆ ఊబిలో నలుగురు చిన్నారులు కూరుకుపోయారు. చిన్నపిల్లలు కావడంతో పైకి రాలేక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు వదిలేశారు. క్షణాల వ్యవధిలోనే ఇదంతా జరగడం కళ్లారా చూసిన తల్లులు అచేతనులై ఉండిపోయారు. విషయం తెలపడంతో గ్రామస్థులు పరుగున వచ్చి పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. ఈసారి వర్షాలకు ఊబి ఏర్పడిందనే విషయం ఎవరికీ తెలియకపోవడం తీవ్ర విషాదానికి కారణమైంది.
పెద్దేరు నదిలో మునిగి నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై విప్ బూడి ముత్యాలనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక నాయకుల ద్వారా ప్రమాద వార్త తెలుసుకున్న ఆయన ఘటనపై అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే ఎంపీడీఓ పోలినాయుడు, ఇన్‌ఛార్జి తహసీల్దారు సత్యనారాయణ, ఎస్సై రామారావు సిబ్బందితో వెళ్లారు.
పసిపిల్లల మృతదేహాలను ఎక్కడికో తీసుకువెళ్లి పోస్టుమార్టం చేయొద్దని తల్లిదండ్రులు అధికారులను వేడుకున్నారు. దీంతో ఎంపీడీఓ పోలినాయుడు, వైసీపీ మండల అధ్యక్షుడు తాళపురెడ్డి రాజారామ్ కలిసి ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుతో ఫోన్‌లో సంప్రదించి వైద్యులను గ్రామానికి పిలిపించారు. ఊబిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.