Amaravati, Nov 16: ఏపీలో వివిధ కారణాలతో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు (AP MPTC And ZPTC Elections 2021) ఇవాళ మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు (AP MPTC And ZPTC Elections) మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం ఫ్రెష్ (రీ) పోల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి విదితమే.
వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్ జిల్లా లింగాల, గుంటూరు జిల్లా కారంపూడి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల 954 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు.
ముగిసిన 'పుర' పోలింగ్, ఈ నెల 17న ఫలితాలు, ఆసక్తికరంగా మారిన కుప్పం, నెల్లూరు మున్సిపాలిటీ ఫలితాలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్
కర్నూలు జిల్లా ఆదోని మండలం, హనవాలు గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది. అధికార పార్టీకి పోలీసులు మద్దతు పలుకుతున్నారంటూ సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రంలోకి గుంపులుగా వెళ్తున్న వైసీపీ నేతలను ఆడ్డుకోవడంలేదని మండిపడ్డారు. వైసీపీ నాయకులను ఇక్కడి నుంచి పంపించివేయాలంటూ పోలీసుల కాళ్లు మొక్కారు.
ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం మురుగుమ్మి ఎంపీటీసీ ఎన్నికలు రెండు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నాయి. మురుగుమ్మి, మారేళ్ళలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, మరేళ్ల పోలింగ్ కేంద్రంలో అధికార పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి హల్ చల్ చేశారు. దీంతో ఇతర పార్టీల ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపడంతో గొడవ సర్ధుమణిగింది.
కర్నూలు జిల్లాలోని నంద్యాల మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మోత్తం 17 గ్రామాలు ఉన్న జెడ్పీటీసీ పరిధిలో 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 43,843 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఎర్పాటు చేశారు. కృష్ణగిరి మాండలం టి.గోకులపాడు ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో 9 గంట వరకు 18.94 శాతం పోలింగ్ నమోదైంది.
కృష్ణా జిల్లాలో ఉదయం 11 గంటలకు జడ్పీటీసీ పోలింగ్ శాతాలు.. జి.కొండూరు జడ్పీటీసీ-28.18 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీ- 16 శాతం, పెడన జడ్పీటీసీ-26.80 శాతం నమోదైంది.
తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖాళీగా వున్న 23 ఎంపీటీసీ స్థానాలకు రెండు ఏకగ్రీవం కాగా మిగిలిన 21 చోట్ల జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 59,156 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
చిత్తూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొసాగుతోంది. బంగారుపాలెం జెడ్పీటీసీ తో పాటు ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం మొత్తం 93 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బంగారుపాలెం జెడ్పీటీసీ బరిలో వైసీపీతో పాటు బిజెపి, బిఎస్పి అభ్యర్థులు బరిలో నిలిచారు.