
Amaravati, April 26: ఏపీలో విద్యుత్ సంక్షోభం పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ సరఫరా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమలకు కూడా పరిమితులు తొలగించి, సాధారణ స్థితిలో విద్యుత్ సరఫరా చేయడానికి కృషిచేస్తోంది. దీన్లో భాగంగా బొగ్గు కొరత కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరతను (Power Crisis in AP) అధిగమించడానికి చైర్మన్, ఐదుగురు సభ్యులతో కోర్ మేనేజ్‌మెంట్ టీమ్‌ను (core team constituted) ఏర్పాటు చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంధనశాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో జెన్‌కో డైరెక్టర్ (బొగ్గు), ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్), ట్రాన్స్‌కో డైరెక్టర్ (ఫైనాన్స్), ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సభ్యులుగా ఉంటారు. ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఈ కమిటీకి కూడా మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.ఫ్యూయెల్ సప్‌లై అగ్రిమెంట్స్ (ఎఫ్‌ఎస్‌ఏ) ప్రకారం బొగ్గును సక్రమంగా సరఫరాకు సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్ బొగ్గు క్షేత్రాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది.
కేంద్ర బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖలతో మాట్లాడి బొగ్గు రవాణా (ర్యాక్స్)లో పరిమితులను పరిష్కరించేందుకు కృషిచేస్తుంది. అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ఆర్థికశాఖకు నివేదిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలతో సమన్వయం చేస్తూ.. థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత బొగ్గు సరఫరా ఉండేలా చూస్తుంది.