Amaravati, August 22: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్యకేసు (Rahul Murder case) నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కోరాడ విజయ్ (Accused surrendered to Police) లొంగిపోయాడు. రాహుల్ హత్యకేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్‌ని రహస్యప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19న రాహుల్‌ని కారులో నిందితులు హత్యచేశారు. రాహుల్ హత్యకేసులో కోరాడ విజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రాహుల్ హత్య కేసులో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు A-1 కోరాడ విజయ్, A-2 పద్మజ, A-3 గాయత్రి, A-4 కోగంటి సత్యం పేర్లను పేర్కొన్నారు.
రాహుల్ తండ్రి రాఘవరావు స్టేట్‌మెంట్ ఆధారంగా సెక్షన్ 302, 120బి, రెడ్‌విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్‌తో కలిపి పోలీసులు అదుపులో ఉన్నవారి సంఖ్య 6కు చేరింది. మాచవరం పోలీసుల ముమ్మర విచారణ కొనసాగుతోంది.
రాహుల్ హత్య వెనుక విజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నా, మరో బడా పారిశ్రామికవేత్త హస్తం కూడా ఉన్నట్టు ఆధారాలు లభించాయి. రాహుల్‌కు, విజయ్ మధ్య లాక్‌డౌన్ నుంచి వివాదాలు నడుస్తున్నాయి. ఇదంతా రూ.కోట్లలో ఉన్నట్టు సమాచారం. ఇద్దరికీ వయస్సురీత్యా చాలా వ్యత్యాసం ఉంది. ఈ డబ్బు గొడవల నేపథ్యంలో కోరాడ ఈ హత్యకు కిరాయి హంతకులను నియమించాడా లేక రాహుల్ వద్ద ఉండే వారినే హంతకులుగా మార్చాడా అన్నది తెలియాల్సి ఉంది. హత్య జరిగిన సమయంలో కోరాడ అక్కడికి సమీపంలో ఉన్నట్టు సమాచారం.
కొరడ విజయ్‌కుమార్‌తో రెండేళ్లుగా రాహుల్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే విజయ్‌కుమార్ ఆర్థికంగా నష్టపోవడంతో వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. కెనడాలో చదివిన కరణం రాహుల్ స్వదేశానికి వచ్చి నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు.
ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ తన కారులోనే శవమై కనిపించాడు. అయితే, అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్యచేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి రాహుల్‌ను హత్యచేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు.
గతంలో హైదరాబాద్‌లో జరిగిన వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో కీలక నిందితుడైన శ్యామ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రశ్నించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్‌లో ఉన్న కొందరిని విచారిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో ఆరా తీస్తున్నారు.
కోరాడ కుటుంబంపై రాహుల్ తండ్రి ఫిర్యాదు
తన వాటా కోసం విజయ్.. రాహులపై ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి రాఘవరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘తన వాటా కూడా కొనుగోలు చేయాలని రాహుల్‌ను విజయ్ కోరారు. డబ్బు కోసం నా కుమారుడిపై తీవ్ర ఒత్తిడి చేశారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలు చర్చలు జరిగాయి. తక్కువ ధరకు అడగడం వల్లే సత్యంకు ఫ్యాక్టరీ అమ్మలేదు. రాహుల్ ఉదంతంలో కోరాడ కుటుంబ సభ్యులకు భాగం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసి కోరాడ ఆర్థికంగా నష్టపోయారు’’ అని రాఘవరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కోరాడ విజయ కుమార్, అతడి భార్య పద్మజ, మరో మహిళ గాయత్రి, రౌడీషీటర్ కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు తెలిసి, వారి పేర్లను నిందితుల జాబితాలో చేర్చినట్టు సమాచారం.