Rains to continue in AP and Telangana for the next three days Anxiety Among Farmers with Rains (Photo-ANI)

Amaravathi, December 3:అరేబియా సముద్రంలో నైరుతి దిక్కున ఏర్పడిన అల్పపీడనం ఏపీ(Andhra Pradesh)ని వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల రైతుల్లో ఈ అకాల వర్షాలు తెగ ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా(Southern Coast), రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారతీయ వాతావరణ విభాగం(indian meteorological department) ప్రకటించింది.  దీంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వరి సాగు చేస్తున్న రైతులు (Farmers) తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణాకు ఈ వర్షాల ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ ఏపీలో మాత్రం రైతులకు భారీ నష్టాల్ని మిగిల్చేలా ఉంది.

అటు శ్రీకాకుళం మొదలు పశ్చిమ గోదావరి వరకు పలు జిల్లాల్లోని కొన్నిచోట్ల ఇప్పటికే వరి కోతలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటుగా చాలా ప్రాంతాల్లో వరి పంట తుది దశలో ఉంది.ఈ సమయంలో ఏమాత్రం వర్షాలు పడినా పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వర్షాల మళ్ళీ ఏం వార్తను మోసుకొస్తాయోనంటూ రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 14.67 లక్షల హెక్టార్లలో వరి సాగయింది. ఉత్తర కోస్తా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరి పంట కోతకు వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో గింజ గట్టిపడే దశలో ఉంది. ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో ఈనిక దశలో ఉంది.

తమిళనాడులో భారీ వర్షాలు

గత ఆగస్టులో వచ్చిన వర్షాలు, వరదలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఉత్తర కోస్తాలో కొన్ని చోట్లో భారీగా వరి పంట దెబ్బతింది. ఆ తర్వాత వచ్చిన వర్షాలకు కృష్ణా, గుంటూరుతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. తుపాన్ల సీజన్‌ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందన్న వాతావరణ శాఖ ప్రకటన రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఇది ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంవల్ల కోస్తాంధ్ర, రాయలసీమలోని చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

ANI Tweet

తమిళనాడులో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు

ఇదిలా ఉంటే తమిళనాడు(Tamil nadu)లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 22 మంది మృతి చెందారు. ఈ కారణంగా 8 జిల్లాల్లో పాఠశాలలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కడలూరులో కురుస్తున్న వర్షాల కారణంగా వేలారు నది పొంగి ప్రవహిస్తోంది.

ఈ ప్రవాహం దాటికి కడలూరులో వంతెన తెగిపోవడంతో పరిసర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామనాథపురం, అరియలూర్‌, శివగింగై, పెరంబలూర్‌, పుదుకొట్టే జిల్లాల్లో వర్షం భారీగా కురిసింది. అంతేకాకుండా మెట్టుపాళ్యంలో అత్యధికంగా 18 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాభావం మరో 24 గంటలపాటు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.