Vjy, Oct 10: టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా (Ratan Tata) మరణం (Death) పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు.
రతన్ టాటా అస్తమయం..శోకసంద్రంలో వ్యాపార ప్రపంచం..భారత కార్పోరేట్ యుగంలో ముగిసిన రతన్ టాటా శకం..
పవన్ మాట్లాడుతూ.. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.
దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్, రతన్ టాటా మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని, దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని అన్నారు.నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారని.. రతన్ టాటా నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు.
రతన్ టాటా మృతి నేపథ్యంలో ముంబై వెళ్లాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ (Minister Lokesh) కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా పార్థివదేహానికి ఇరువురు నివాళులు అర్పించనున్నారు. ఈరోజు ఉదయం 11:45 గంటలకు వెలగపూడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గన్నవరం వెళ్లనున్నారు.
12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకోనున్న సీఎం చంద్రబాబు, లోకేష్... 3 గంటలకు నారిమన్ పాయింట్‌లోని ఎన్‌సీపీఏ లాన్స్‌లో రతన్ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. తిరిగి 3:30 గంటలకు అమరావతికి సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.