Amaravati, July 3: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం (AP Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్నదాతలకు రకరకాల సేవలందిస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) (Rythu Bharosa Kendralu (RBKs) రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో సేవకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడీ కష్టాలకు తెరపడనున్నాయి. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఈ సేవలు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనుంది. కాగా గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్‌బీకేలున్నాయి. వీటిలో 234 అర్బన్ ప్రాంతంలోనూ..10,544 గ్రామీణ ప్రాంతంలో రైతులకు (Farmers) సేవలందిస్తున్నాయి.
సీజన్‌లో రుణాల మంజూరు, రీషెడ్యూల్‌లతో పాటు వివిధ రకాల సేవల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా రైతుల ముంగిటకే బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్ సేవలందించేందుకు బ్యాంకర్లు సైతం ముందుకొచ్చారు. శాఖల్లేని ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సుమారు 11,500 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను నియమించుకున్నాయి.
వీరిలో 8,500 మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరు రోజూ నాలుగైదు గ్రామాలకు వెళ్లి అక్కడ అకౌంట్‌లు లేని వారితో ఖాతాలు తెరిపించడం, బ్యాంకు-ఆధార్ సీడింగ్, కేవైసీ అప్డేషన్, నగదు ఉపసంహరణ వంటి సేవలందిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఆర్‌బీకేల్లో వీరి ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఆర్‌బీకేలతో బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను మ్యాపింగ్ చేస్తున్నారు.
బ్యాంకు కరస్పాండెంట్లు అందించే సేవలు
⇒ వీరి వద్ద ఉండే మొబైల్ స్వైపింగ్
⇒ మిషన్ ద్వారా గరిష్టంగా రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
⇒ కొత్తగా అకౌంట్‌లు ఓపెన్ చేసుకోవచ్చు.
⇒ ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చు.
⇒ ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేసే సాగు ఉత్పాదకాలతో పాటు యాంత్రీకరణ, కూలీలకు నగదు బదిలీ చేసుకోవచ్చు.
⇒ పంట రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
⇒ కొత్త రుణాల మంజూరు, రీషెడ్యూల్ చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు.