Godavari Boat Mishap Update: సాయంత్రానికి రాయల్ వశిష్ట బోటు బయటకు వచ్చే అవకాశం, బోటుకు తాళ్లు బిగించిన విశాఖ డీప్ సీ డైవర్స్, మరో డెడ్ బాడీ బయటకు, 40 అడుగుల లోతులో బోటు
Royal Vasista capsized scuba-divers-find-royal-vasishta-boat-in-v-shape: PTI

Devi patnam, October 21: దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీత ఆఖరి దశకు చేరుకుంది. విశాఖ నుంచి వచ్చిన డీప్ సీ డైవర్స్.. నదీ గర్భంలో ఉన్న బోటుకు తాళ్లు బిగించేశారు. బోటు ముందు భాగానికి స్కూబా డైవర్స్ ఐరన్ రోప్స్ కట్టారు. ఇక ప్రొక్లెయినర్లతో బోటును లాగడమే మిగిలి ఉంది. కాగా సాయంత్రానికి బోటు బయటకు వస్తుందని ధర్మాడి సత్యం బృందం, డీప్ సీ డైవర్స్ అంచనా వేస్తున్నారు. నదీ లోపలకు వెళ్లిన స్కూబా డైవర్స్ గోదావరి అడుగుభాగాన 40 అడుగుల లోతులో ఉన్న రాయల్ వశిష్ట బోటును గుర్తించారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం బోటులో బాగా ఒండ్రు మట్టి చేరినట్లు తెలుస్తోంది. సాధారణంగా బోటు 40 టన్నులు ఉంటుందని ఇప్పుడు మట్టి చేరడంతో మరింతగా బరువు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోటు బోల్తా పడకుండా నీటిపై వెళ్లేటప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉందని వారు చెబుతున్నారు.

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2లో భాగంగా.. 4 రోజులుగా బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించింది. చివరికి గోదావరిలో బోటు ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. ఐరన్ రోప్‌తో ఉచ్చు బిగించడంతో పాటు యాంకర్‌తో బోటును బయటకు లాగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో బోటు రెయిలింగ్ బయటకు వచ్చింది. కానీ పూర్తిస్థాయిలో బోటును వెలికితీయలేకపోయారు.

బోటు వెలికితీత పనులు చేపట్టిన ప్రతిసారి కచ్చులూరు మందం వద్ద భారీగా వర్షం పడుతుండటంతో వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోంది. నదీ గర్భంలోని బోటుకు ముందు భాగంలో ఐరన్‌ రోప్‌ చుట్టేందుకు ఆదివారం మెరైన్‌ డైవర్లు ప్రయత్నించగా వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. భారీగా వర్షం కురవడంతో సాయంత్రం 5 గంటలకు పనులను నిలిపివేశారు. తిరిగి సోమవారం పనులు ప్రారంభిస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సోమవారం బోటును వెలికితీసే పని పూర్తవుతుందని ధర్మాడి సత్యం బృందం, మెరైన్‌ డైవర్లు చెప్పారు.

ఇదిలా ఉంటే..కచ్చులూరు వద్ద మరో మృతదేహం బయటపడింది. బ్లాక్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉంది. బోటు ప్రమాదంలో మరణించిన వ్యక్తిగా యోచిస్తున్నారు. అయితే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో, తల లేకుండా ఉండడంతో గుర్తుపట్టడం కష్టసాధ్యమౌతోంది. సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 77 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.