Srikakulam, NOV 05: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని (Srikakulam IIIT campus) గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల్లో 16మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని క్యాంపస్ నుంచి ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ (food poisoning) అయిన విద్యార్థులు నిన్నటి నుంచి ఇంకా కోలుకోలేదు. వైద్యం కోసం క్యాంపస్ లోని డిస్పెన్సరీస్ ను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఉదయం నుంచి డిస్పెన్సరీలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులే విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ (food poisoning) విషయం తెలుసుకున్న తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను సందర్శించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీశారు. గురువారం రాత్రి మెస్ లో చపాతీలు (Chapathi) తిని అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో శుక్రవారం తెల్లవారుజామున క్యాంపస్ లోని ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఆశ్రయించారు.
శుక్రవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు డిస్పెన్సరీలో 336 మంది విద్యార్థులకు చికిత్స అందించారు అధికారులు. డిస్పెన్సరీ రిజిస్ట్రర్ లో నమోదైన విద్యార్థుల్లో ఎక్కువమంది కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే, గుట్టుచప్పుడు కాకుండా క్యాంపస్ హెల్త్ సెంటర్ లోనే విద్యార్థులకు చికిత్స అందించారు ట్రిపుల్ ఐటీ (Srikakulam IIIT campus) అధికారులు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ అయ్య వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపుతోంది. ఇంత జరిగినా.. అధికారులు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడారని మండిపడుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి కంగారు పడుతున్నారు.
ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో 3వేల మందికి విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఇక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు కూడా కలకలం రేపాయి. తాజాగా వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.