Scrub Typhus (Photo/Wikimedia Commons)

Anantapur, Sep 15: ఏపీలో కొత్త ఫీవర్ వ్యాధి కలకలం రేపుతోంది. స్క్రబ్‌ టైపస్‌ వ్యాధితో ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన గవ్వల మధు(20) గురువారం మృతిచెందాడు. ఇలాంటి వ్యాధితో ఒకరు మరణించడం జిల్లాలో ఇదే తొలిసారి. 15 రోజుల క్రితం మధు జ్వరం బారినపడడంతో ధర్మవరం, అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత నెల 31న చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచాడు.

మధు స్క్రబ్ టైపస్ వ్యాధితోనే మృతి చెందినట్టు ప్రచారం జరగడంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు వెంటనే మధు స్వగ్రామమైన పోతుకుంటకు ప్రత్యేక బృందాన్ని పంపారు. ఆసుపత్రి రికార్డుల్లో మధు స్క్రబ్ టైపస్‌తోనే మృతి చెందినట్టు ఉండడాన్ని ఈ బృందం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. ఇది ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని, కీటకం కుట్టడం ద్వారా మనిషికి సోకుతుందని తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో కీటక నివారిణి స్ప్రే చేశారు. మధు కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచారు.

మూత్రం లేదా మలం ద్వారా కూడా నిపా వైరస్ వ్యాప్తి, ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి, లేదంటే 24-48 గంటల్లో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం

గతంలో విజయవాడకు చెందిన ఓ యువకుడు తీవ్రమైన చలి, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్నా ఫలితం లేకపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. ఆ రోగి వ్యాధి లక్షణాలను బట్టి డెంగీగా భావించి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయినా జ్వరం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండటంతో అన్ని రకాల వైద్యపరీక్షలు చేయించారు. అన్నీ నెగెటివ్‌ రావడంతో నిపుణులైన వైద్యులను సంప్రదించారు.

చివరికి తేలిందేమంటే ఆ యువకుడికి సోకింది వైద్యుల ప్రాధాన్యక్రమంలో ఉన్న విషజ్వరాల జాబితాలోనిది ఏదీ కాదు. ఆ యువకుడు ‘స్క్రబ్‌ టైపస్‌’ వైరస్‌ బారిన పడ్డాడని వైద్యనిపుణులు గుర్తించారు. వెంటనే తగిన చికిత్స అందించి ఆ యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.

గతేడాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని అప్పాపురంలో స్క్రబ్ టైపస్ వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి సోకిన కారణంగా గ్రామంలో విషజ్వరాలు వంటి వాటి బారిన పడి ఒకే కుటుంబానికి చెందిన ఎండ సూరమ్మ, ఎండ భవానీలు మృతి చెందారు.మరి కొంత మంది కూడా ఆ వ్యాధి లక్షణాలతో సతమతమయ్యారు.కేసులు పెరగడంతో వారిని ప్రత్యేక చికిత్స కోసం రిమ్స్ కి తరలించి అక్కడ చికిత్స చేశారు. బాధితులు కోలుకున్నారు.

కేరళలో నిపా వైరస్ కల్లోలం, 42 ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు, పలు ఆంక్షలు అమల్లోకి..

కుప్పంలో సరికొత్త స్క్రబ్‌ టైపస్‌ ఫీవర్‌ అనే కొత్తరకం జ్వరం కేసు రిజిస్టర్‌ అయినట్లు పీఈఎస్‌ వైద్య కళాశాల డీన్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హెచ్‌ఆర్‌.కృష్ణారావు, మెడికల్‌ సూపరిండెంటు డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. చాలా అరుదుగా వచ్చే ఈ జ్వరం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చాలాకాలంపాటు ఈ జ్వరం కొనసాగితే శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా రోగి మరణానికి కూడా దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.

స్క్రబ్‌ టైపస్‌ ఫీవర్‌ అనే విష జ్వరం ఒక క్రిమి కాటువల్ల వస్తుందన్నారు. ఈ క్రిములు పొలాల్లో.. ఉతకని దుస్తుల్లో.. శుభ్రం చేయని బట్టల బీరువాల్లో ఉంటాయని వివరించారు. పిల్లలు, వృద్ధులకు ఎక్కువగా ఈరకం జ్వరం సోకుతుందన్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వొళ్లు నొప్పులు, శరీరంపై దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. ఈ జ్వర ప్రభావం వల్ల కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతింటాయన్నారు. ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వదిలిన దుస్తులను ఎప్పటికప్పుడు ఉతికి ఎండలో ఆరేయడం, తరచూ స్నానం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శరీరంపై నల్లటి మచ్చలు కనిపించినా.. పై లక్షణాలలో ఏవి కనిపించినా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు.

వైద్యలు ఏం చెబుతున్నారు.

స్క్రబ్‌ టైపస్‌ వ్యాధి ఓరియంటల్‌ సుసుగుమ అనే బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది. ఇది ప్రధానంగా కొండ ప్రాంతాల్లో సంచరించే ఎలుకల్లో ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఎలుకను.. నల్లుల వంటి కీటకాలు కుట్టినప్పుడు దాని శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. అదే కీటకం తిరిగి మనిషిని కుట్టడం ద్వారా వ్యాధి సోకుతుంది. ఒక మనిషి నుంచి మరొక మనిషికి నేరుగా సోకదు. బ్యాక్టీరియా కలిగిన కీటకం మనిషిని కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో నల్లగా మారి దద్దుర్లు వస్తాయి.

వ్యాధి సోకిన వ్యక్తిలో మొదట జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స అందించకపోతే శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా దెబ్బతిని మరణం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. 2019లో పశ్చిమ్‌ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో ఈ వ్యాధిని గుర్తించినట్లు శ్రీసత్యసాయి జిల్లా సర్వెలెన్స్‌ అధికారి కుళ్లాయప్ప నాయక్‌ తెలిపారు.

ఈ బ్యాక్టీరియా స్థానికంగా సోకిందా లేదా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా సోకిందా అనే అనుమానాలను అధికారులు వ్యక్తపరుస్తున్నారు. కియా పరిశ్రమలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు వేల సంఖ్యలో పని చేస్తున్నారు. వారి నుంచి కూడా మధుకు వ్యాధి సోకి ఉండవచ్చని చెబుతున్నారు. ఆ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలిపారు.

వ్యాధికి కారణం అయిన పురుగులు ఎక్కువగా వ్యవసాయ భూములలో పెరుగుతుంటాయని వాటి సోర్స్ ఎక్కడ ఉందో కూడా గుర్తించడం జరిగిందని వైద్యులు చెబుతున్నారు.చిన్న పాటి జ్వరాలు ఉన్న వెంటనే వైద్య శిబిరంలో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిని సంప్రదించి సేవలు పొందాలని వైద్యులు ప్రజలకి సూచిస్తున్నారు.