Amaravati, Feb 14: ఏపీలో రెండు విడతల పంచాయితీ ఎన్నికలు (AP Local Body Polls) ముగిశాయి. ఇప్పటివరకు రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయభేరి మోగించింది. 13 జిల్లాల్లో అత్యధిక స్థానాలను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకుని అగ్రస్థానాల్లో నిలిచారు. ఇక ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు (Andhra Pradesh Panchayat Elections) జరగనున్నాయి. మూడో దశ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటన చేశారు.
అన్ని జిల్లాల్లో కలిపి 579 పంచాతీయలు, 11,732 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని వెల్లడించారు. మిగిలిన 2,640 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 7,756 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని నిమ్మగడ్డ వివరించారు. అటు, రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం కావడం తెలిసిందే. మూడో విడతలో అంతకుమించి ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలో ఈ నెల 21న జరిగే నాలుగో విడత పోలింగ్ తో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.
మూడో విడత 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, ఆయా గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 13 జిల్లాల నుంచి సమాచారం అందాక, ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం శనివారం అధికారికంగా విడుదల చేసింది. 579 సర్పంచ్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మూడో విడత 2,640 సర్పంచ్ స్థానాలకు (రెండు స్థానాల్లో నామినేషన్ దాఖలు కాలేదు) ఎన్నికలు జరగనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం పేర్కొంది. 7,756 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరుగుతుందని తెలిపింది.
కాగా, మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత 11,732 వార్డులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. 19,607 వార్డులలో 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలిపింది. కాగా, 177 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.
నాలుగో విడతలో 3,228 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 20,156 నామి నేషన్లు, వార్డు పదవులకు 88,285 నామి నేషన్లు దాఖలు అయ్యాయి. 33,434 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 88,285 మంది నామినేషన్లు వేశారు. చివరి దశ పంచాయతీ ఎన్నికలకు భారీ స్థాయిలో అభ్యర్థులు బరిలో నిలిచారు. నాలుగో(చివరి) దశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఈ గ్రామ పంచా యతీల్లో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగియనుంది.