Amaravati, February 3: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మొదటి దశలో మొత్తం 3,88,307 టీకా కోసం రిజిస్టర్ చేసుకోగా 1,89,890 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు టీకాలు వేసుకున్నారు. తొలి విడతలో 48.90 శాతం వ్యాక్సినేషన్ నమోదయిందని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 3 నుండి రెండవ దశ టీకాల పంపిణీ ప్రారంభమైంది. మున్సిపల్, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మరియు పారిశుధ్య కార్మికులకు ఈ రెండవ దశలో టీకాలు వేయనున్నారు. కోవిన్ యాప్ ద్వారా ఈరోజు వరకు 5.9 లక్షల మంది టీకా కోసం నమోదు చేసుకున్నారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,445 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 95 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,88,099కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,85,204గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో కృష్ణా జిల్లా నుంచి 17 కేసులు రాగా, గుంటూరు మరియు విశాఖ జిల్లాల నుంచి 16 చొప్పున కేసులు నమోదయ్యాయి, జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో కొవిడ్ కారణంగా విశాఖ జిల్లాలో ఒక మరణం సంభవించింది. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7157కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 129 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,79,780 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,162 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.