Vjy, Oct 9: టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్‌నెట్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తన పేరును కొట్టేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ సుప్రీంకోర్టు ముందు సోమవారం విచారణకు రానుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ నెల 3న దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.

అందుకు అనుగుణంగా సోమవారం ఈ కేసు 59వ ఐటం కింద విచారణకు రానుంది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థలూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఎ సెక్షన్‌ను అనుసరించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై కేసు నమోదు చేసేటప్పుడు గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు.

కేంద్రహోంమంత్రితో వైయస్ జగన్ కీలక భేటీ, ఇరువురి సమావేశంలో దానిపైనే కీలక చర్చ జరిగిందంటూ వార్తలు, సమావేశంలో చర్చించిన అంశాలపై రకరకాల ఊహాగానాలు

2021 సెప్టెంబరు 7న స్కిల్‌ సంస్థ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు డిసెంబరు 9న కేసు నమోదుచేశారని, అందువల్ల దీనికి గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాదించారు. అయితే, ఈ కేసు విచారణ 2018లో 17ఎ సెక్షన్‌ రాకముందే ప్రారంభమైనందున గవర్నర్‌ అనుమతి అవసరం లేదని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. ఏపీ హైకోర్టు కూడా తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందన్నారు.

అయితే ధర్మాసనం ఆ పత్రాలను తమకు సమర్పించాలని చెబుతూ కేసును వాయిదా వేసింది. రాష్ట్రప్రభుత్వ అధికారులు పత్రాలు సమర్పించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులూ అదనపు పత్రాలు సమర్పిస్తూ ఐఏ దాఖలుచేశారు. చంద్రబాబు అరెస్టయ్యి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టీ సోమవారం సుప్రీం ఇవ్వబోయే ఆదేశాలపైనే ఉంది.

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, పోలీసు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది.