Prakasam, June 30: తప్పు చేశాను కాబట్టే, శిక్ష పడింది కదా.. అన్న విషయాన్ని మరిచిపోయిన ఓ విద్యార్థి (Student) దారుణానికి తెగబడ్డాడు. తనను డీబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రం (Exam Centre) ఉన్న కాలేజీ ప్రిన్సిపల్‌పై (College Principal) దాడికి తెగబడ్డాడు. బ్లేడుతో అతడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ షాకింగ్ ఘటన జరిగింది. గొంట్ల గణేశ్ అనే విద్యార్థి స్థానిక కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గతేడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల సందర్భంగా అతడు కాపీ కొడుతూ దొరికిపోవడంతో స్క్వాడ్ డీబార్ చేసింది. నాటి నుంచీ అతడు ఆ కళాశాల ప్రిన్సిపల్ మూల కొండారెడ్డిపై కక్షతో రగిలిపోయాడు.
అకస్మాత్తుగా దాడి
స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద గురువారం రాత్రి కొండారెడ్డిపై గణేశ్ అకస్మాత్తుగా దాడికి దిగాడు. బ్లేడుతో గొంతు కోయబోతుంటే కొండారెడ్డి చేయి అడ్డుపెట్టి తప్పించుకున్నారు. ఈ క్రమంలో చేతికి కూడా గాయమైంది. స్థానికులు కొండారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.