Amaravati, Nov 28: అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం విచారణ జరిపింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఈ సందర్భంగా హైకోర్టు (Andhra Pradesh High Court) ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?. ఆరు నెలల్లో నిర్మాణం (develop Amaravati as a capital city ) చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీం పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.ఆలోపు జవాబు తప్పనిసరిగా దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, శ్రీరామ్, నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా నివాళి అర్పించిన సీఎం జగన్
రాజధాని ప్రాంత రైతుల తరఫున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదించారు. హైకోర్టు ఆదేశించిన ఏడు అంశాలపై స్టే విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా.. దానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ కాలపరిమితికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై మాత్రమే స్టే విధించింది.