Amaravati,Sep 26: ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై (Eenvironmental damage) నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం...సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు (Supreme court) కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ నష్టాన్ని ప్రభుత్వం ఎందుకు భరించదని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ (AP Govt)ని ప్రశ్నించింది.
ఈ ఒక్క కేసు విచారణకు ఎంతమంది సీనియర్ లాయర్లను ఎంగేజ్ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ కేసులో లాయర్లకు ఎంత ఫీజు చెల్లించారో తెలుసుకునేందుకు నోటీసులు జారీ చేస్తామని కోర్టు వ్యాఖ్యానించింది. లాయర్లకు ఫీజు చెల్లింపులో ఉన్న శ్రద్ధ.. పర్యావరణ పరిరక్షణపై కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాది కల్పించుకుని ఇప్పటికీ పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. పోలవరం వల్ల 50 వేల మందికిపైగా ముంపునకు గురయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా తిరిగి కల్పించుకున్న బెంచ్.. పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతలపై ఇచ్చిన తీర్పుపైనా విచారణ చేపడతామని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అనంతరం ఎన్జీటీ తీర్పులపై దాఖలైన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని వెల్లడించింది. ఈ క్రమంలోనే కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
కాగా ఏపీలో పలు ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి అపార నష్టం జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్.. ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మొత్తంగా 3 ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ ఎన్జీటీ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.3 అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడు వేర్వేరు అప్పీళ్లను సుప్రీంలో దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై జస్టిస్ రస్తోగి, జస్టిస్ రవికుమార్‌లతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది.
ఇప్పటికీ పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న పెంటపాటి పుల్లారావు తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. అప్పీళ్ల విషయంలో పై కీలక వ్యాఖ్యలు చేసింది.