Amaravati, June 10: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడాన్ని ఏపీ హైకోర్టు (AP High Court) తప్పు పట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ్లిన సంగతి విదితమే. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బాబ్డే (Chief Justice S A Babde), జస్టిస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ లాయర్లు ముకుల్ రోహత్గి, రాకేశ్ ద్వివేదీ వాదనలను వినిపిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, ఎన్నికల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక వ్యవస్థలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోందని చెప్పారు.
ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను కొట్టివేసిందని మరోవైపు అవే నిబంధనల ప్రకారం నిమ్మగడ్డ రమేశ్ ను పదవిలో కూర్చోబెట్టాలంటూ విరుద్ధమైన అభిప్రాయాలను వెల్లడించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చారని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ధర్మాసనాన్ని కోరారు.
మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించడం చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చిందని, కోర్టు ఆదేశాల ప్రకారం గతంలో నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadaa Ramesh Kumar) నియామకం కూడా చెల్లదని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది వాదనలు వినిపించారు. కోర్టు తప్పుపట్టిన నిబంధనతో నియమించబడిన రమేష్ కుమార్ తిరిగి ఎలా కొనసాగింపబడతారని ప్రశ్నించారు.
ఈ వాదననలపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ... రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఆర్డినెన్స్ జారీ చేయడం వెనకున్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని అన్నారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇక పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై రెండు వారాల్లోగా సమధానం చెప్పాలని మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సహా ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
నిమ్మగడ్డ రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని... రమేశ్ కుమార్ తరపు లాయర్ హరీశ్ సాల్వే, టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాది ఏకే గంగూలీ ధర్మాసనాన్ని కోరారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికిప్పుడే ఆదేశాలు ఇవ్వలేమని, రెండు వారాల తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలను జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
ఈ కేసులో ప్రతివాదులు చాలా మంది ఉన్నారని, అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పింది. రెండు వారాల్లోగా ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేస్తే తదుపరి విచారణను కొనసాగిస్తామని చెప్పిన ధర్మాసనం... తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో జూన్ 1న పిటిషన్ దాఖలు చేసింది